కలలు!!
కలలు కనని వాళ్ళు మనుషులు కాదోయ్-అని ఖచ్చితంగా అనను, ఎందుకంటే మనుషులే కలలు కంటారు కాబట్టి- పగలూ రాత్రీ కూడా!
ఈ భూ ప్రపంచంలో కలలుకనని మనిషి ఉంటే నాకు చూపించండి-నేనేదో వాళ్ళకి కలలు తెప్పిస్తా అని కాదు,వాళ్ళకి ఏదో ప్రయోగాలు చేసి వాళ్ళు మామూలు మనుషులు కాదు అని ఠక్కున చెప్పేస్తా అంతే.
కలలు మనుషులు తప్ప మిగతా జీవరాసులు కనా లేవు, ఒకవేళ శాస్త్రవేత్తలు నువ్వు చెప్పేది తప్పు అని,నా వాదన కొట్టి పారేస్తే వాళ్ళని లెక్కలోకి తీసుకుంటా అనుకోండి.
అయినా,వాళ్ళతో మాత్రం అలాగే అంటాను-(వాళ్ళ మీద గౌరవం మెండు)- లేకపోతే వాళ్ళు నన్నుప్రయోగశాలకి తీసికెళ్లి నామీద పరీక్షలు చేస్తారు.నేను అన్నిరోజులు అక్కడ ఉంటే ఇవన్నీ ఎవరు రాస్తారు,అందుకని- మీమీద ప్రేమతోనే అయినా కలలు భగవంతుడు మనిషికి ఇచ్చిన పేద్ద వరం అండి,అందుకనే చూడండి కొంతమంది మహానుభావులు కలలోనే బతికేస్తారు వాళ్ళ జీవితం అంతా,వారంతా ఉపాధి కోల్పోరు ఈవరం లేకపోతే.
అసలు విషయానికి వస్తే కలలు పలురకాలు- కళలు అరవై నాలుగే!!
పగటి కలలు!
నలుపు తెలుపు కలలు!
రంగు రంగుల కలలు!
గేవా రంగు కలలు!
సంబంధ లేనివి!
తలాతోక లేనివి!
తలబద్దలు కొట్టుకున్నా అర్ధం కానివి!
ఎంత ప్రయత్నం చేసినా గుర్తుకు రానివి!
అర్ధం పర్థం లేని- టీ.వీ లో వచ్చే ధారావాహింకంలా రోజూ వచ్చేవి!
రకరకాల క్లయిమాక్స్ తోవచ్చేవి!
భయపడి,దడుసుకు చచ్చేట్టు వచ్చి,
టపీమని నిద్రలోంచి లేపి చచ్చేవి!
చచ్చినా పూర్తిగా గుర్తు ఉండలేనివి!
అవతల వాళ్లు కలలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత చెప్పినా నమ్మలేనివి!
“గురూ రాత్రి నా కలలోకి వచ్చావు” అని ఆప్త మిత్రుడికి చెప్పినా నమ్మలేనివి!
పైగా వాడు “నాకేం పని లేదట్రా నీ కలలో రావడానికి” అని దెప్పిపొడుపు కూడాను!
కొన్ని కలలు మనం ఎప్పుడు నిద్రపోతామో అని ఎదురుచూసేవి,కళ్ళు మూతపడీ పడకుండానే వచ్చేవి.అది, “నిద్రలోనా మెలకువలోనా” అని తికమక పెట్టేవి!
పోనీ పాపం అని వాటిని వదిలేస్తే అర్థం-పర్థం లేకుండా వచ్చేవి కొన్ని,రాంగోపాల్ వర్మ సినిమాల్లోలాగా!
అలా అని నిద్ర ఆపుకుందాం,ఇవి మనల్ని దుంపతెంచుతున్నాయి అని అనుకుంటే మనకళ్లు మనమాట వింటాయా.మనకు తెలియకుండానే మూతపడతాయి టపాలున కలలు రయ్యిరయ్యిన దూసుకొస్తాయి-లైటులేని మోటారు సైకిల్ ని పట్టుకోవాలని మూలకాచుకున్న పోలీసు వచ్చినట్లు!
పోనీ అలా అని “విశ్వామిత్రుణ్ణి” అడిగి ఆయన “రామలక్ష్మణులకు” నేర్పిన రెండు మంత్రాలు “ఆకలి- నిద్రా” రాకుండా (“బలా,అతిబలా” అనుకుంటా)నేర్చుకుందాం అనుకుంటే -ఆయనేమో చచ్చినా నాకు నేర్పను అన్నాడు. ఇది మీఅందరికీ నేర్పితే ఇరవైనాలుగు గంటలూ పనిచేస్తారు తిండికూడా లేకుండా.తిండీ,నిద్రా లేకుండా పనిచేసి సంపాదించి ఏం చేస్తారు.ఇప్పటికే మీరు సరిగా నిద్రా తిండీ లేకుండానే బతికేస్తున్నారు అని కొద్దిగా చిరుకోపంతో అన్నాడు.
కొద్దిగా బతిమాలుదాం అనుకున్నా లొంగకుండా ఉంటాడా అని,ఊర్వశికి లొంగలా అని,ఆవిడ అంటే అద్భుత సౌందర్యరాశి. నాకు ఎందుకు లొంగుతాడు-మగవాణ్ణి, మానవమాత్రుణ్ణి-పైపెచ్చు శాపం పెట్టినా పెడతాడు ఎందుకొచ్చిన గొడవ అని మిన్నకున్నా.
అందునా మన స్వర్గీయ రాష్ట్రపతి డాక్టర్.అబ్దుల్ కలామ్ గారేమో కలలు కనమని పదేపదే చెప్పేవారు-వెళ్ళేటప్పుడు కూడా- మరీమరీ చెప్పారాయే.పోనీ లేండి, కలల్ని కనేద్దాం, మంచివాటిని నిజం చేసుకుందాం! మనం నిద్ర మానేస్తే కలలకు పనే ఉండదు కదా-వాటి జీవనోపాధి మన నిద్రే!!!
సుఖంగా నిద్రపోదాం- ఒక్క విషయం-మీకు వచ్చిన, నచ్చిన,గుర్తున్నకలలు నాకు మాత్రం చెప్పండి,నేను ఎవరికి చెప్పను.నాకు రాయడానికి కాస్త విషయాలు దొరుకుతాయి కదా అని నా ఆశ.అంతేగాని “మీ కలల్లో భాగస్వామిని అవుదామనీ కాదు.మీ కలల్లోకి దూరదామనీ కాదు సుమా”(యాంకర్ “సుమ” కూడా కాదండి బాబూ, మీకు అన్నీ డబుల్ మీనింగులే మరీనూ!!!)
ఉంటా మరి- నాకూ కలలుకనే సమయం అయింది-అంటే పగటికలలు కూడా కందామని;పగటికలలు కందామంటే నా కల “పగటి కలగానే” మిగిలిపోయింది. పగలు నిద్రపోలేక పోవడం వల్ల!
చిన్న సలహా, అద్బుతమైనది: మీకు కలలు గుర్తు ఉండకపోతే, నన్ను మీకలల్లోకి తీసుకువెళ్ళండి.నేను గుర్తు పెట్టుకుని మరీ చెపుతా మీకు,మీరు నిద్రలేచిన తర్వాత, మీరు మర్చిపోయినా!
కలల్నికనండి,వాటిని సాకారం చేసుకోండి-మీ ఈప్రయత్నంలో-సాకారానికి ఏదైనా నా సహకారానికి అవసరపడితే సంకోచించకండి, చాతనైతే ఒక చేయివేస్తా.
గమనిక:
ఈరోజు,మాఅమ్మాయితో మాట్లాడుతూ ఉంటే కలల గురించి ఏదోయధాలాపంగా దొర్లింది (దాని నిద్దర్లో కాదండీ)మా మాటల్లో-దాని ఫలితమే ఈ కలల రాతలు క్రెడిట్ దానికే మరీ, నేను ఏదీ ఉంచుకోనండీ ఉచితంగా!!!